మాల్దీవులతో(Maldives) భారత్ బంధం ఇప్పటిది కాదని, శతాబ్దాల నాటిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తన భారత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. భారత్, మాల్దీవుల బంధానికి అభివృద్ధి సహకారమే మూలస్తంభమని అన్నారు. మాల్దీవుల అవసరాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఈ భేటీలో భాగంగా భారత్, మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపారు. ఈ సందర్బంగా ప్రతి విపత్కర పరిస్థితుల్లో కూడా మాల్దీవులకు ఆపన్న హస్తం అందించడంలో భారతే ముందు ఉందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తాజాగా మాల్దీవులకు భారత్ 40కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగానే భారత్ సహకారంతో మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేను ప్రధాని మోదీ(PM Modi), ముయిజ్జు(Mohamed Muizzu) వర్చువల్‌గా ప్రారంభించారు. అదే విధంగా మాల్దీవుల్లో రూపే కార్డు చెల్లింపులు కూడా మొదలయ్యాయి. ఈ నిర్ణయం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సహకారపడతాయని ఇరు దేవాల నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారత్ సహకారంతో మాల్దీవుల్లో(Maldives) చేపడుతున్న పలు ఇతర ప్రాజెక్టలను కూడా ఇరు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. ఎగ్జిమ్ బ్యాంకు సహకారంతో నిర్మించిన 700 సామాజిక గృహ యూనిట్లను మాల్దీవులకు భారత్ అప్పగించింది. ఇందులో భాగంగానే విదేశీ మారక నిల్వల కొరతను నివారించడం కోసం కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని కూడా ఢిల్లీ కుదుర్చుకుంది.