బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) మరో వివాదానికి కేంద్రంగా నిలిచారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బలమైన నాయకత్వం వల్ల రైతు ఉద్యమ సమయంలో భారత్ పెను ముప్పు తప్పిందన్నారు ఆమె. అప్పట్లో కేంద్రంలోని బీజేపీ నాయకత్వం బలంగా లేకపోయినట్లయితే అప్పట్లోనే భారత్‌కు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏర్పడిన పరిస్థితి ఏర్పడి ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమాన్ని భారత ప్రభుత్వం అద్భుతంగా హ్యాండిల్ చేసిందని, లేకుంటే శవాలు వేలాడేవని, మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు విచ్చలవిడిగా జరిగి ఉండేవంటూ వివరించారు. ఈ వ్యాఖ్యలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేశారు. దీనికి సంబంధించిన వీడియె క్లిప్‌ను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
‘‘రైతు ఉద్యమం వెనక చైనా, అమెరికాల కుట్ర ఉంది. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉండటం వల్లే పరిస్థితులు చేజారకుండా అడ్డుకోవడం సాధ్యమైంది. లేకుంటే ఎన్నో ఘోరాలు జరిగి ఉండేవి’’ అని ఆమె(Kangana Ranaut) వివరించారు. ఆమె వ్యాఖ్యలను విపక్షాలు, అఖిల భారత కిసాన్ సభ(AIKS) తీవ్ర ఆక్సేపణ తెలిపాయి. ఆమె వ్యాఖ్యలు దేశంలోని ప్రతి రైతును అవమానించేలా ఉన్నాయని లోక్‌సభలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.