బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలకంగా మారింది. బీహార్ అంతటా ఇదే చర్చ నడుస్తోంది. అతి త్వరలోనే నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని, ఇప్పటికే ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ప్రచారం జోరందుకుంది. తాజాగా వీటిపై బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రావణ్ కుమార్ స్పందించారు. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ఆయన తండ్రి నితీష్ కుమార్ చేతుల్లోనే ఉందన్నారు.
సోమవారం బల్లియాలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారా? లేదా అనేది పూర్తిగా నితీష్ కుమార్ చేతుల్లోనే ఉంది. ఆయన ఆమోదం లేకుండా సాధ్యం కాదు. నిశాంత్ కుమార్‌కు బిహార్ రాజకీయ పరిస్థితులపై అవగాహన, పట్టు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అన్నారు. ఇటీవల ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి నితీష్(Nitish Kumar) హాజరు కాకపోవడానికి కారణాన్ని సైతం మంత్రి వివరించారు. సీఎంకు నలందలో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమం ఉన్నందునే రాలేకపోయారని, జేడీయూ తరఫున సంజయ్ ఝా, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ హాజరయ్యారన్నారు.