మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నేత వినోద్ తావ్‌డే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య హైడ్రామా నెలకొంది. పాల్‌గర్ జిల్లాలోని ఓ హోటల్‌లో బీజేపీ నేతలు.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నాలసోపరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌కు ఓటేయాలని కోరుతూ బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్‌డే(Vinod Tawde), మరికొందరు నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘ఎన్నికలను ప్రభావితం చేయడానికి బీజేపీ డబ్బులు పంచుతోంది. ఇందులో పార్టీ అధినేతలు కూడా ఉన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం’’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తావ్‌డే.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే(Mallikarjun Kharge), అగ్రనేత రాహుల్(Rahul Gandhi) గాంధీకి పరువు నష్టం నోటీసులు అందారు.
‘‘సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను.. నా సుధీర్ఘ రాజకీయ కెరీర్‌లో ఏనాడూ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా నా పరువు తీయాలనే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేశారు. వారు నాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ నోటీసులు పంపాను’’ అని తావ్‌డే(Vinod Tawde) వెల్లడించారు.