దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు జరగకుండానే బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ(Surat Lok Sabha) స్థానం నుంచి బీజేపీ తరపున ముఖేష్ దలాల్(Mukesh Dalal) బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నీలేష్ కుంభానీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నీలేష్ కుంభానీ వేసిన నామినేషన్‌ను జిల్లా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థి సురేష్ పాద్‌సాలా నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది.
మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న 8 మంది అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కాగా.. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి కూడా ఉండటం విశేషం. దీంతో పోటీలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ మాత్రమే ఉండటంతో ఆయన ఎంపీగా ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా గుజరాత్‌లోని 28 నియోజకవర్గాలకు మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు సూరత్ పార్లమెంట్ స్థానం(Surat Lok Sabha) ఏకగ్రీవం కావడంతో 27 నియోజకవర్గాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది.