మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5న మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణస్వీకారం జరగనుంది. కానీ ఇప్పటి వరకు విజయం సాధించిన మహాయుతి(Mahayuti Alliance) తరపున సీఎం అభ్యర్థి ఎవరు అన్న అంశంపై ఉత్కంఠ వీడలేదు. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా ఉన్న ఫడ్నవీస్(Devendra Fadnavis) ఈసారి సీఎం కానున్నారన్న వార్తలు భారీగా వినిపిస్తున్నా.. కూటమి తరుపు నుంచి మాత్రం ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రమాణ స్వీకార సమయం దగ్గరపడుతున్నా సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని విపక్షాలు తూర్పారపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే మహాయుతి విఫలమైందంటూ విమర్వలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి అంశంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మరోసారి స్పందించారు.
‘‘ప్రజలు ఆశించిన విధంగా మా ప్రభుత్వం పాలన అందించడానికి మరోసారి రెడీగా ఉంది. ప్రజా నిర్ణయంతో మాకు మరింత బాధ్యత పెరిగింది. అయితే.. మహారాష్ట్ర సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించాలన్న విషయంలో బీజేపీదే(BJP) తుది నిర్ణయం.
అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటా. నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి చర్చలు జరుపుతోంది. సీఎం ఎవరన్న విషయంపై కూటమిలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఈ విషయంలో కూటమి పార్టీలన్నీ కలిసి ఏకాభిప్రాయానికి రానున్నాయి’’ అని షిండే(Eknath Shinde) తెలిపారు.