మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్(Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిగా గెలవదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సొంత పార్టీ నేతలే బీజేపీ ఒంటరి విజయంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర రాజకీయ చర్చలకు దారితీస్తోంది. ఒంటరిగా గెలవలేకపోయినా మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల గురించి ప్రాక్టికల్‌గా ఉండాలని, ఏది ఏమైనా మహారాష్ట్రలో విజయం సాధించేది మాత్రం మహాయుతి మిత్రపక్షాలైన బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన(Eknath Shinde Shiva Sena), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ(NCP)లదేనని అన్నారు.
‘‘మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిగా గెలవలేదు. కానీ అధిక సంఖ్యలో సీట్లను మాత్రం తప్పకుండా సాధిస్తుంది. ఓటింగ్ శాతం కూడా అత్యధికంగా నమోదు చేస్తుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ(BJP) అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. బీజేపీ కూటమిలోని మూడు పార్టీలు సాధించే ఓట్లతో రాష్ట్రంలో విజయం మాదే’’ అని ధీమా వ్యక్తం చేశారు ఫడ్నవీస్(Devendra Fadnavis). మహారాష్ట్రలోని 288 స్థానాల్లో బీజేపీ ఇప్పటి వరకు 121 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది.