ఢిల్లీలో ఈనెల 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ప్రపంచ దేశాల అధినేతలు భారత్‌కు విచ్చేస్తున్నారు. తాజాగా యూకే ప్రధాని రిషి సునక్(Rishi Sunak) సతీసమేతంగా ఢిల్లీకి చేరుకున్నారు. వీరికి ఢిల్లీ విమానాశ్రయంలో భారతీయ సంప్రదాయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా హస్తినలో అడుగుపెట్టారు.
శని, ఆదివారాలలలో జరిగే జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈ సదస్సుకు భారత్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ తదితరులు హాజరవుతున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. వీరి తరఫున ఆయా దేశాల ప్రతినిధులు వస్తున్నారు. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కూడా రావడం లేదు.
జీ20 దేశాల్లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యూకే, అమెరికా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఉంది.