బీఎస్పీ అధనేత్రి మాయావతి(Mayawati) తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. ఆమె అనంతరం పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు అనే సందేహానికి తెర దించారు. ఈ మేరకు ఆదివారం ఆమె అధికారిక ప్రకటన చేశారు. తన తర్వాత మేనల్లుడు ఆకాష్ ఆనంద్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. ఈరోజు లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆమె.. తన నిర్ణయాన్ని నేతలకు తెలియజేశారు. గత ఏడాదిగా ఆకాష్ ఆనంద్(Akash Anand) పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, మాయావతి తీసుకున్న నిర్ణయంతో ఆమె తర్వాత పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లోకి వెళ్ళనున్నాయి.
కాగా ,ఆకాష్ ఆనంద్ మాయావతి(Mayawati) తమ్ముడి కుమారుడు. లండన్ లో ఎంబీఏ చేసిన ఆయన.. 2017 లో బీస్పీలో జాయిన్ అయ్యారు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యంత గుర్తింపును సాధించారు. నజ్మీర్ లో 2022 లో పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్ యాత్రలోనూ ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలకంగా వ్యవహరించారు.
ఇక మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడిని ప్రకటించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు ఈ ప్రకటన చేయడం వ్యూహాత్మక నిర్ణయమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి మాయావతి మేనల్లుడు ఆకాష్ పార్టీని మరింత బలోపేతం చేయగలరా? పార్టీలోని సీనియర్లను, జూనియర్లను కలుపుకుంటూ ముందుకు నడిపించగలరా? మేనత్త పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టగలరా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.