లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) భారీ షాక్ తగిలింది. ఈడీ కేసులో ఇప్పటికే ఆమె తీహార్ జైలులో ఉండగా.. తాజాగా కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 6న ఆమెను జైలులో ప్రశ్నించింది. తాజాగా అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. గతంలో కవితను విచారించిన సమయంలో నమోదు చేసిన స్టేట్‌మెంట్, అప్రూవర్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.
కవిత రెగ్యులర్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరగనున్న నేపథ్యంలో సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23వరకు పొడిగించారు. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ(ED) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజులు ఈడీ కస్టడీలో విచారించగా.. అనంతరం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న కవిత(MLC Kavitha)ను తీహార్ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) కూడా అరెస్టై తిహార్ జైలులో ఉన్న విషయం విధితమే.