రేషన్ కార్డుల(Ration Cards) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో డిజిటలైజేషన్ భారీ మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఆహార భద్రతలో భారత్ తన మార్క్ చూపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా దేశంలో 80.6 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. తాజాగా ఈ వ్యవస్థలో ఉన్న రేషన్ కార్డుల ప్రక్షాళనకు కేంద్ర చర్యలు చేపట్టింది. ఆధార్(Aadhaar) ధ్రువీకరణ, ఈకేవైసీ(KYC) వెరిఫికేషన్ ద్వారా నకిలీ కార్డులను(Fake Ration Cards) ఏరిపారేస్తోంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5.8 కోట్ల నకిలీ కార్డులను గుర్తించి, వాటిని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలీకరణ చేశారు. దేశవ్యాప్తంగా 5.33 లక్షల రేషన్ షాపులకు ఈపోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో 99.8 శాతం కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. తద్వారా 98.7 శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయింది. మరోవైపు ఈకేవైసీ ప్రక్రియతో ఇప్పటి వరకు 64 శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది.