దేశ కీర్తిని ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిపిన చంద్రయాన్-3(Chandrayaan 3) మిషన్ మరో అద్భుతాన్ని సృష్టించింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ మరోసారి సేఫ్ ల్యాండ్ అయింది. భవిష్యత్ లో చంద్రుడిపై చేపట్టబోయే మానవ సహిత ప్రయోగాలకు ఊతం ఇచ్చేలా విక్రమ్ ల్యాండర్ తాజాగా చంద్రుడి ఉపరితలంపైకి ఎగిరి మరోసారి సేఫ్ గా ల్యాండ్ అయినట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది. ‘ఓ హోప్ ఎక్సపర్మెంట్’ పేరుతో విక్రమ్ ల్యాండర్(Vikram Lander) లో ఉన్న ఇంధనాన్ని శాస్త్రవేత్తలు ఆదివారం మండించారు. చంద్రుడి ఉపరితలంపై నుంచి దాదాపు 40 సెం.మీ వరకు పైకి ఎగిరిన విక్రమ్ ల్యాండర్.. గతంలో ల్యాండ్ అయిన ప్రాంతానికి 30-40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Chandrayaan 3 | ఈ ప్రక్రియ విజయవంతం కావడం భవిష్యత్ లో మానవ సహిత ప్రయోగాలలో తిరిగి భూమికి చేరుకునే ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ ప్రయోగం తర్వాత ల్యాండర్ లో అన్ని వ్యవస్థలు సహజంగానే ఉన్నాయని ఇస్రో పేర్కొంది. రోవర్, ల్యాండర్ ఉన్న ప్రాంతంలో చీకటి రావడంతో సూర్యోదయం వరకు రోవర్, ల్యాండర్ లను శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్ లోకి తీసుకువెళ్లారు. సెప్టెంబర్ 22వ తేదీని తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. సూర్యోదయం తర్వాత పంపే డేటాపై ఇస్రో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.