వినాయక చవితి రోజున ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(CJI Chandrachud) ఇంటికి విచ్చేశారు. ఆయన నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం మోదీ, చంద్రచూడ్ పలు అంశాలపై చర్చించుకున్నారు. అయితే సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విమర్శలపై తాజాగా సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. న్యాయమూర్తులపై దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సరైన పద్దతి కాదని అన్నారు.
‘‘గణపతి పూజ సందర్భంగా ప్రధాని మోదీ మా ఇంటికి రావడం తప్పులేదు. అది బహిరంగ భేటీ. ఎటువంటి వ్యక్తిగత సమావేశం కాదు. అధికారి విభజన అంటే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలపై చర్చించొద్దని అర్థం కాదు. దీనిని అందరూ గుర్తుంచుకోవాలి’’ అని చంద్రచూడ్(CJI Chandrachud) వివరించారు. అంతేకాకుండా అయోధ్య తీర్పుకు ముందు తాను దేవుడికి ప్రార్థించుకోవడంపై కూడా అనేక వార్తలు ప్రచారమవుతున్నాయని, కానీ తాను ప్రతిమలపై గౌరవం, విశ్వాసం ఉన్న వ్యక్తినే అని స్పష్టం చేశారు.