Delhi Ministers | ఢిల్లీ కొత్త మంత్రుల పూర్తి వివరాలివే!

-

Delhi Ministers | దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరిగింది. ఇందులో హస్తిన వాసులంతా కమళం గుర్తుకే పట్టం కట్టారు. దీంతో దాదాపు 27ఏళ్ల తర్వాత అధికారం చేపట్టింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే గురువారం ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మ, ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో వీరి ప్రమాణ స్వీకారం అంబరాన్నంటేలా జరిగింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు, ఎన్డీయే కీలక నేతలు, 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్  నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మరోవైపు సినీ, పారిశ్రామిక రంగాల పలువురు ప్రముఖులు సైతం విచ్చేశారు. అయితే ఎమ్మెల్యేలు ఆశిష్ సూద్, మంజిన్డెర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్.. ఢిల్లీ నూతన మంత్రులుగా(Delhi Ministers) ప్రమాణం చేశారు. వీరి గురించిన పూర్తి విరాలు ఇలా ఉన్నాయి.

Delhi Ministers : 

పర్వేశ్ వర్మ: అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పర్వేశ్ వర్మ.. ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్ల తేడాది ఓడించారు. ఆయన 7 నవంబర్ 1977న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ, సాహిబ్ కౌర్ దంపతులకు జన్మించారు. ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం, కిరోరి మాల్ కాలేజీలలో చదువుకొని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందాడు. పర్వేశ్ వర్మ మాజీ కేంద్ర మంత్రి & మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె స్వాతి సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు సనిధి సింగ్, ప్రిషా సింగ్, ఒక కుమారుడు శివేన్ సింగ్ ఉన్నారు.

పర్వేశ్ వర్మ(Parvesh Varma) తన తండ్రి అడుగుజాడల్లోనే బీజేపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపగా ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మెహ్రౌలీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి నరీందర్ సింగ్ సెజ్వాల్ పై 4,564 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఆశిష్ సూద్: ఢిల్లీ ఎన్నికల్లో జనక్‌పురి నుంచి ఈయన పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను 18,766 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. 2 సెప్టెంబర్‌ 1966న ఆయన జన్మించారు. ఆశిష్ సూద్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి కార్పొరేటర్‌గా ఎన్నికై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ సభా నాయకుడిగా, భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) ప్రధాన కార్యదర్శిగా, బిజెవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా, జమ్మూ కాశ్మీర్‌ బిజెపి ఇన్‌చార్జ్‌గా, గోవా సహ-ఇన్‌చార్జ్‌గా, ఢిల్లీ బిజెపి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు.

ఆయన(Ashish Sood) 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో జనక్‌పురి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి రాజేష్ రిషి చేతిలో 14,917 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మంజీందర్ సింగ్ సిర్సా: 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రాజౌరి గార్డెన్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ధన్వతి చందేలాపై 18,190 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ‘శిరోమణి అకాలీదళ్’ పార్టీ ద్వారా ప్రారంభించారు.

2017లో అకాలీదళ్, బీజేపీ పొత్తులో భాగంగా ఆయన అకాలీదళ్ పార్టీలో ఉంటూనే బీజేపీ అభ్యర్థిగా రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అందులో 14,652 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1 డిసెంబర్ 2021న పలు కారణాల వల్ల ‘అకాలీదళ్’ పార్టీ రాజీనామా చేసి బీజేపీలోచేరారు. 2020 ఎన్నికలకు ఆయన(Manjinder Singh Sirsa) దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

రవీందర్ ఇంద్రజ్ సింగ్(Ravinder Indraj Singh): బవానా నియోజకవర్గం నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన రవీందర్ ఇంద్రజ్ సింగ్.. ఆప్ నేత జై భగ్వాన్‌ను 31,475 ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన 2000లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ కోర్సులు మరియు కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నుండి దూర విద్య ద్వారా బీఏ పూర్తి చేశాడు.

కపిల్ మిశ్రా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కరావాల్ నగర్ నియోజకవర్గం నుండి మిశ్రా ఎమ్మెల్యేగా గెలిచారు. 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కరావాల్ నగర్ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా మిశ్రా పోటీ చేశారు . ఆయన తన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి మోహన్ సింగ్ బిష్ట్‌ను 44,431 ఓట్ల తేడాతో ఓడించి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

2017లో అరవింద్ కేజ్రీవాల్, ఆయన మాజీ క్యాబినెట్ సహోద్యోగి సత్యేంద్ర కుమార్ జైన్‌పై అవినీతి ఆరోపణలు చేసిన ఒక రోజు తర్వాత కపిల్ మిశ్రా(Kapil Mishra) పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేయబడ్డారు. అయితే రూ.2కోట్ల లంచం తీసుకున్నారన్న కేసులో లోకాయుక్త ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2 ఆగస్టు 2019న, ఆయన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద శాసనసభ నుండి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. 17 ఆగస్టు 2019న ఆయన అధికారికంగా బీజేపీలో చేరారు.

పంకజ్ సింగ్(Pankaj Kumar Singh): వికాస్‌పురి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పంకజ్ కుమార్ సింగ్.. ఆప్ అభ్యర్థి మహిందర్ యాదవ్‌ను 12,876 ఓట్ల మెజార్టీతో చిత్తు చేశారు. ఆయన 6 నవంబర్ 1977న జన్మించారు. 1998లో బీహార్‌లోని బోధ్ గయలోని మగధ్ విశ్వవిద్యాలయంలో దంత శస్త్రచికిత్సలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. ఆయన MCDలో మాజీ అదనపు కమిషనర్‌గా పనిచేసిన దివంగత రాజ్ మోహన్ సింగ్ కుమారుడు. పంకజ్ సింగ్ భార్య రష్మి కుమారి కూడా దంతవైద్యురాలే.

Read Also: చీటింగ్ కేసులో మంత్రికి జైలు శిక్ష
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kishan Reddy | ‘14 నెలల్లో రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన ఘనుడు రేవంత్’

తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని...

Revanth Reddy | రాజకీయ పావుగా పాలమూరు: రేవంత్

గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి...