దేశంలో కాంగ్రెస్ భవితవ్యంపై బీజేపీ నేత ఆశివ్ దేశ్‌ముఖ్(Ashish Deshmukh) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ భవిష్యత్తు శూన్యమని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు అందరూ కూడా కాషాయ పార్టీకి వచ్చేయాలని పిలుపుకూడా ఇచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర అంతటా తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. బహిరంగంగా ప్రత్యర్థి పార్టీ నేతలను తమ పార్టీలోకి వచ్చేయాలని పిలవడం ఏంటని, అంటే ఫిరాయింపులను బీజేపీ పెంచి పోషిస్తుందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయన మాజీ కాంగ్రెస్ నేత కావడంతోనే ఇప్పుడు ఈ తరహాలో పిలుపునిచ్చారని పలువురు అంటున్నారు.
‘‘మహారాష్ట్రలో మహాయుతి(Mahayuti Alliance) చారిత్రాత్మక విజయం సాధించింది. కాంగ్రెస్ మహా పతనాన్ని దేశమంతా చూసింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటమిని చూస్తున్నాం. దేశంలో కేవలం మూడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పలు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల కూటములు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసున్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ మేజర్ పార్ట్‌నర్‌గా లేదు. గతం కంటే ఇప్పుడు కాంగ్రెస్‌కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇంకా అందులోనే ఉంటే నేతల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమే అవుతుంది. అందుకే కాంగ్రెస్ నుంచి ఎన్నికైన 16 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరాలి’’ అని దేశ్‌ముఖ్(Ashish Deshmukh) పిలుపునిచ్చారు.