భారతదేశ జాతీయ ఎన్నికల సంఘం(Election Commission)పై కేంద్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం అద్భుతంగా చేస్తున్న పని ఒకే ఒక్కటంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అది తన స్వతంత్రతను పక్కనబెట్టడమేనని వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది కాంగ్రెస్. ఆ విషయంలో ఎన్నికల సంఘానికి మరే ఇతర సంస్థ పోటీ ఇవ్వలేదంటూ చురకలంటించింది. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల ఫలితాలు(Haryana Election Results) ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేశాయి. అనూహ్యంగా బీజేపీ భారీ విజయం సాధించింది. దీంతో ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
ఎన్నికల సంఘం మాత్రం కాంగ్రెస్(Congress) ఫిర్యాదును తోసిపుచ్చింది. అంతేకాకుండా తమకు అనుకూల ఫలితాలు రాని ప్రతిసారీ కాంగ్రెస్ ఇదే విధంగా నిరాధారమైన విమర్శలు చేస్తుంటోందని, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు వాళ్ల బాధ్యతారాహిత్యమేనని విమర్శలు కూడా గుప్పించింది. దాంతో పాటుగా హర్యానా ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఇలాంటి అనవసర ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది కూడా.
ఎన్నికల సంఘం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్.. ఈసీ(Election Commission) మాటలు తనకు ఆశ్చరకరంగా అనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘‘కానీ సమాధానం ఇచ్చి తీరు, పార్టీపై చేసిన ఆరోపణలు, అందులో వాడిని భాష కారణంగానే తిరిగి లేఖ రాయాల్సి వచ్చింది. ఈసీ ఇదే భాషను వినియోగిస్తే.. వాటిని తొలగించడానికి న్యాయవ్యవస్థను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు’’ అని కాంగ్రెస్ తన లేఖలో పేర్కొంది.