కొంతకాలంగా మణిపూర్(Manipur) రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి పైగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ.. మణిపూర్ అంశంపై స్పందించాలని కేంద్రస్థాయిలోని ప్రతిపక్షాలు కూడా డిమాండ్లు చేరస్తున్నాయి. మణిపూర్‌లో శాంతి భద్రతలకు బీజేపీ ప్రభుత్వమే గండికొడుతోందని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సందిస్తున్నాయి. కాగా తాజాగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు, వాటికి దారి తీసిన అంశాలపై సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో సరైన పాలన అందించకపోవడం కారణంగానే వాటి పరిణామాలు ఇప్పుడు ప్రతిబింబిస్తున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంపై మండిపడ్డారు సీఎం. మణిపూర్ పరిస్థితికి పాలన చేతకాని బీజేపీ ప్రభుత్వమే అసలు కారణం అన్న చిదంబరం వ్యాఖ్యలను బీరెన్ సింగ్(Biren Singh) తోసిపుచ్చారు.
ఈ సందర్బంగానే చిదంబరం(Chidambaram)పై విమర్శనాస్త్రాలు సంధించారు బీరెన్. ‘‘కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు విని ఆశ్చర్యపోయా. రాష్ట్రంలోని పరిస్థితులకు నన్ను బాధ్యుడిని చేయడం సబబు కాదు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులే ఈ పరిస్థితులకు కారణం. కేంద్ర హోంశాఖ మంత్రిగా చిదంబరం ఉన్న సమయంలోనే ఓక్రమ్ ఇబోబి సింగ్ మణిపూర్(Manipur) ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు మయన్మార్‌కు చెందిన తంగ్లియన్‌పావ్ గైట్‌ని రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. అతడు మయన్మార్‌లో నిషేధిత జోమీ రీ-యూనిఫికేషన్ ఆర్మీ ఛైర్మన్. ఆ దేశం నుంచి అక్రమ వలసదారుల సమస్య మణిపూర్‌లో ఈరోజు ఈ పరిస్థితులకు దారి తీసింది. రాష్ట్రంలో అన్ని పరిస్థితులను కాంగ్రెస్ పార్టీనే సృష్టించింది. ఆ పార్టీ ఈశాన్య ప్రాంతాలను, స్థానికులను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితికి అతనే కారణం’’ అని బీరెన్ ఆరోపించారు.