ఉత్తరాఖండ్(Uttarakhand) హల్ద్వాని లోని మదర్సా కూల్చివేత ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హింసాత్మక ఘటనలతో హల్ద్వాని నగరం అట్టుడుకుతోంది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదులను గురువారం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూల్చివేసి. దీనికి నిరసనగా స్థానికులు హింసాత్మక ఆందోళనలు మొదలుపెట్టారు. కూల్చడానికి వచ్చిన మున్సిపల్ కార్మికులు, పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పోలీస్ స్టేషన్, వాహనాలను తగలబెట్టారు. ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించి, కనిపిస్తే కాల్చేయమని ఆదేశాలిచ్చారు. ఈ అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు సహా 250 మందికి గాయాలయ్యాయి. అల్లర్ల నేపథ్యంలో నగరంలో ఇంటర్నెట్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేశారు.
కాగా, కోర్టు హల్ద్వానీలోని వన్‌భుల్‌పురా లో మదర్సా, మసీదు నిర్మాణం అడ్మినిస్ట్రేషన్ చట్టవిరుద్ధమని తెలిపింది. కూల్చివేసేందుకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ అధికారుల బృందం, పోలీసులతో కలిసి నిర్మాణాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. బుల్‌డోజర్‌తో నిర్మాణాలను ధ్వంసం చేయడంతో ప్రాంతంలోని నివాసితుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆగ్రహించిన స్థానికులు, మహిళలతో సహా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
నిరసనకారులు పోలీసులు, మున్సిపల్ కార్మికులు, జర్నలిస్టులపై రాళ్లు విసిరారు. వారిని క్లియర్ చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో మరింత రెచ్చిపోయిన అల్లరి మూకలు 20కి పైగా ద్విచక్రవాహనాలు, సెక్యూరిటీ బస్సును తగులబెట్టారు. పోలీస్ స్టేషన్ కి, బయట వాహనాలకు నిప్పు పెట్టడంతో హింస మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశం అయ్యారు. నిషేధాజ్ఞలు, పెరుగుతున్న అశాంతిని నియంత్రించడానికి అల్లర్లకు వ్యతిరేకంగా షూట్-ఎట్-సైట్ ఆవశ్యకతపై చర్చించారు. హింసాత్మక అల్లర్లు ఉదృతం కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించి షూట్-ఎట్-సైట్ ఆదేశాలు జారీ చేశారు.
ఘర్షణలపై ఉత్తరాఖండ్(Uttarakhand) ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల తర్వాత కూల్చివేతలను నిర్వహించడానికి ఒక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపినట్లు తెలిపారు. అయితే ఆ ప్రాంతంలోని సంఘ వ్యతిరేకులు పోలీసులతో ఘర్షణ పడ్డారని చెప్పారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు అదనపు పోలీసులు, కేంద్ర బలగాలను మోహరిస్తున్నామన్నారు. శాంతిభద్రతలు కాపాడాలని సీఎం ధామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అయితే కోర్టు ఉపశమనం కల్పించకపోవడంతో కూల్చివేత కొనసాగింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 14న జరగనుంది. ఈ ఘర్షణ ల్లో నలుగురు మరణించగా.. 50 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు అధికారులు, మున్సిపల్ కార్మికులు జర్నలిస్టులకు కూడా ఎదురు దాడుల్లో గాయాలపాలయ్యారు.