దేశ రాజధాని ఢిల్లీపై సీఎం అతిశీ(Atishi Marlena) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అంటే రాజధాని కాకుండా.. గ్యాంగ్‌స్టర్ల అడ్డా గుర్తుకొస్తోందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని సీఎం అతిశీ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీ శాంతి భద్రతలను కనుమరుగయ్యాయని వ్యాఖ్యానించారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.
‘‘ఢిల్లీ అనేది గ్యాంగ్‌స్టర్లకు రాజధాని(Gangster Capital)గా మారింది. నేరస్థులు, దోపిడీదారులు, గూండాలకు భయం అనేది లేకుండా పోయింది. వారి బరితెగింపు ఇటీవల ఓ వ్యక్తి ప్రాణాలు బలితీసుకుంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) నుంచి ఓ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత తన చేతుల్లోకి వచ్చాక ఆయన ఏం చేశారు? శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. దోపిడీలు, హత్యలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ ఆయనకు ప్రచారం తప్ప వేరే బాధ్యతలు లేనట్లుగా అనిపిస్తోంది’’ అంటూ అతిశీ(Atishi Marlena) విమర్శలు గుప్పించారు.