సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) తాజాగా స్పీడ్ పెంచింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి పలు రాష్ట్రాల అధికారులపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే మిజోరం, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాల్లోని సీనియర్ అధికారులపై కూడా వేటు వేసింది.
ఇక పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బృహన్ ముంబై కార్పొరేషన్ కమిషనర్, అదనపు, డిప్యూటీ కమిషనర్లను తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తు్న్నారనే ఫిర్యాదులతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ(Election Commission) వర్గాలు తెలిపాయి.