ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి(Yamini Krishnamurthy) తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మరణం నృత్య రంగానికి తీరని లోటని ప్రముఖ నృత్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యామినీ కృష్ణమూర్తి(Yamini Krishnamurthy).. 1940లో ఆంధ్రప్రదేశ్ మదనపల్లెలో జన్మించారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యకారిణిగా ఆమె ప్రపంచప్రఖ్యాతి గాంచారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారలతో కేంద్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్తాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ను స్థాపించి ఎంతో మందికి నృత్య కళలో శిక్షణ అందించారు. ‘ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ అనే పుస్తకాన్ని కూడా ఆమె రచించారు.