కేరళ(Kerala)లో రెండేళ్ల క్రితం జరిగిన బీజేపీ నేత శ్రీనివాస్ రంజిత్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దోషులుగా నిలిచిన 15 మందికి మావెలిక్కర్ జిల్లా కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2021 లో జరిగిన ఈ హత్య కేసులో కుటుంబ సభ్యుల ఎదుటే రంజిత్ అతికిరాతకంగా చంపబడ్డారు. అయితే దోషులంతా బ్యాన్ చేసిన PFI, SDPI సంస్థలకు చెందిన వారు కావడంతో ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు అధికారులు.
కేసుకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 2021 డిసెంబర్ 19న అలప్పుజా లో బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ(Kerala) కార్యదర్శి శ్రీనివాస్ రంజిత్(Srinivas Ranjith) హత్యకు గురయ్యారు. PFI, SDPI సంస్థలకు చెందిన కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యుల ముందే కిరాతకంగా మర్డర్ చేశారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేస్ ఫైల్ చేశారు. ఈ నెల 20న రంజిత్ హత్య కేసుపై జిల్లా కోర్టులో విచారణ జరగగా.. న్యాయస్థానం 15 మంది నిందితులను దోషులుగా తేల్చింది. మంగళవారం మరోసారి విచారణ జరిపిన కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది.