దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా తమిళనాడులోని 39 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. దీంతో సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓటర్లకు కీలక పిలుపునిచ్చారు. ‘2024 లోక్‌సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తొలివిడతలో భాగంగా వివిధ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తప్పక ఓటు వేయాలి’’ అని ట్వీట్ చేశారు.
తమిళనాడులో సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక సినీ ప్రముఖులు కమల్‌హాసన్, అజిత్, శివకార్తికేయన్, ధనుష్, ఖుష్బూ సుందర్, త్రిష, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఓటు వేశారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అంచనాలు అందుకుంటూ కచ్చితంగా ప్రతిపక్ష కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్‌తో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఓటు వేశారు.