భారత్‌లో అధికారంలో ఉన్న గత ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM Modi) విమర్శలు గుప్పించారు. 2014 వరకు కూడా ఈశాన్య రాష్ట్రాలను అసలు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధిని ఓట్లతో తూకం వేసేదన్నారు. అందువల్లే తక్కువ ఓట్లు, సీట్లు ఉన్న ఈశాన్య రాష్ట్రాలు(Northeast States) ప్రాధాన్యం పొందలేదని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల సచేతన వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని భారత మండపంలో అష్టలక్ష్మీ మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తించారు. ఈశాన్య రాష్ట్రాల కోసం కేంద్రంలో తొలిసారి ప్రత్యేక మంత్రిత్వశాఖను ప్రారంభించిన ప్రభుత్వం వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) సర్కార్ అని చెప్పారు. దాంతో పాటుగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి శాఖకు కేటాయించే బడ్జెట్‌లో 20శాతం నిదులను కేటాయించారని వివరించారు.
‘‘దేశ అభివృద్ధితో ఈశాన్య రాష్ట్రాలు అనుసంధానమయ్యేలా తన నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు 700 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రజల మనోభావాలు, ఆర్థిక వ్యవస్థ, జీవావరణంతో ఈశాన్య ప్రాంతాలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల మాదిరిగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా గోహతి, షిల్లాంగ్, ఇంఫాల్, ఇటానగర్ అభివృద్ధి చెందుతాయి’’ అని వివరించారు మోదీ.