ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్(Champai Soren) ఎంపికయ్యారు. జేఎంఎం-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. వీలైనంత త్వరగా చంపై సోరెన్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని అభ్యర్థించారు. అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్(Hemant Soren) రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
అటు భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం రాంచీలోని హేమంత్ ఇంటికి చేరుకున్న అధికారులు దాదాపు 7 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆయన అరెస్టును ఖండిస్తూ గిరిజన సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. హేమంత్(Hemant Soren) అరెస్ట్‌ను కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాలను వేధించే విభాగాలుగా తయారయ్యారని ఆరోపణలు చేశారు.