కర్ణాటక ఎన్నికలకు మరో తొమ్మిదిరోజులు మాత్రమే ఉండడంతో రాజకీయల పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా ప్రకటించింది. యూనిఫాం సివిల్ కోడ్ అమలుతో పాటు, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ముఖ్యంగా పేర్కొన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోను ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బెంగళూరులో విడుదల చేశారు. ఏసీ రూంలో మేనిఫెస్టోను తయారు చేయలేదని.. పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సమాచారంతో దీన్ని రూపొందించామని నడ్డా చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులను త్వరలోనే బహిష్కరిస్తామని తెలిపారు.
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రోజూ అరలీటర్ నందినీ పాలుతో పాటు నెలకు 5కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల మహిళలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఇస్తామంది. అంతేకాకుండా పేదలకు ప్రతి ఏడాది ఉగాది, గణేష్ చతుర్ధి, దీపావళి పండగల సందర్భాల్లో ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చింది.