ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన G20 Summit ముగిసింది. పలు దేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఉక్రెయిన్‌లో శాంతికి అన్ని దేశాలు పిలుపునిచ్చాయి. ప్రధాని మోదీ ముగింపు ప్రసంగం చేశారు. ఈ సదస్సుకి వచ్చిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్‌లో వర్చువల్ G20 సమావేశాలు జరపనున్నట్టు ప్రకటించారు. అనంతరం వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌కి గావెల్ అందించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.
రెండో రోజు సెషన్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీతో కలిసి దేశాధినేతలు అందరూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్దకు చేరుకుని మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. ఇక ఈ సమావేశాల్లో ఆఫ్రికన్ యూనియన్‌కు కూటమిలో శాశ్వత సభ్యత్వం కల్పించారు. ఆఫ్రికన్ యూనియన్‌కు సభ్యత్వం కల్పించాలన్న భారత్ ప్రతిపాదించగా.. అందుకు సభ్యదేశాలన్నీ ఆమోదం తెలిపాయి. దీంతో G20 Summit పేరును జీ21గా మార్చారు. దీనితో పాటు పలు కీలక అంశాలపై ప్రపంచ నేతలు చర్చలు జరిపారు. జీ20 సదస్సు ముగియడంతో సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు తమ తమ దేశాలకు పయనమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వియత్నాంకు పయనమయ్యారు.