ప్రాజెక్ట్‌లు సొంతం చేసుకోవడం కోసం ప్రభుత్వ అధికారులకు భారీ మొత్తంలో తాయిలాలు అందించారన్న ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Adani) తొలిసారి నోరు విప్పారు. తమ సంస్థపై అమెరికాలో కేసులు నమోదు కావడాన్ని తాము ఒక ఛాలెంజ్‌గానే తీసుకుంటామని చెప్పారు. తమపై జరిపే ప్రతి దాడి తమను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడం అదానీ సంస్థలకు కొత్తేమీ కాదని, గతంలో ఎన్నో కేసులను విజయవంతంగా ఎదుర్కోనే ఈనాడు ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. రాజస్థాన్ జైపూర్‌లో నిర్వహించిన 51వ జెమ్ అండ్ జ్యూవెలరీ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రెండు వారాల క్రితం అమెరికాలో అదానీ సంస్థలపై వచ్చిన ఆరోపణల గురించి చాలా మందికి తెలుసు. ఇలాంటి సవాళ్లు సంస్థకు కొత్త కాదు. మనపై జరిగే ప్రతి దాడి మనల్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆ విషయాన్ని నేను కచ్ఛితంగా చెప్పగలను. సంస్థకు ఎదురైన ప్రతి అవరోధం.. అభివృద్ధికి సోపానంగా మారుతుంది’’ అని అదానీ(Adani) చెప్పుకొచ్చారు. అయితే సోలార్ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడంలో భారీ మొత్తంలో అదానీ లంచాలు ఇచ్చారని అమెరికాలోని ఒక కోర్టు నిందాభియోలు మోపింది.