దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి చేరుకుంటోంది. గడిచిన నాలుగేళ్లలో రెండింతలు పెరిగిన బంగారం ధరలు.. ఈ ఒక్క ఏడాదిలోనే 35శాతం పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వచ్చేవి పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యులు బంగారం ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు.
శుక్రవారం బంగారం ధర వేలల్లో పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1100 పెరిగి రూ.92,150 కి చేరింది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ తో దేశీయంగానూ బంగారం ధర పెరిగినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర గరిష్టంగా 3,086 డాలర్ల స్థాయికి చేరింది. మన దేశంలో గతేడాది 40సార్లకు పైగా ఆల్ టైమ్ హై కి చేరింది. మొత్తంగా చూసుకుంటే ఒక్క ఏడాదిలోనే బంగారం ధర(Gold Rates) 35 శాతం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 1న 10 గ్రాముల బంగారం ధర రూ.68,420 ఉంది. ఏడాది వ్యవధిలోనే సుమారు రూ. 23,730 పెరిగింది. ఈ లెక్కన చూస్తే త్వరలోనే బంగారం ధర లక్ష రూపాయల మార్క్ చేరుకోవచ్చని బంగారం మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.