పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు శుభవార్త చెప్పాయి. శుక్రవారం బంగారం ధరలు(Gold Rates) భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వచ్చాయి. కానీ, నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1600 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 84,000 ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1740 తగ్గడంతో ప్రస్తుతం తులం బంగారం ధర రూ.91,640 ఉంది. ఇక వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. కేజీ వెండి పై నాలుగు వేల రూపాయలు తగ్గి రూ.1,08,000 కి చేరింది.
డాలర్ ఇండెక్స్‌లో అస్థిరత, బలహీనమైన స్పాట్ డిమాండ్ ల మధ్య… ఏప్రిల్ 4, శుక్రవారం ఉదయం సెషన్ లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు(Gold Rates) తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సుంకాల ప్రకటనల తర్వాత అంతర్జాతీయంగా బంగారం ధరలు కూడా తగ్గాయి. ఏప్రిల్ 2న, ట్రంప్ 180 కి పైగా దేశాలపై పరస్పర సుంకాలను(Tariffs) ప్రకటించారు. అలాగే అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం బేస్ లైన్ సుంకాన్ని ప్రకటించారు.
బంగారం, వెండి ధరలు(Silver Rates) గణనీయంగా తగ్గడానికి ట్రంప్ సుంకం కారణమని చెబుతున్నారు. భారతదేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై పరస్పర సుంకం కింద ట్రంప్ 27% పన్ను విధించారు. అయితే, బంగారం, వెండిని ఈ వర్గం నుండి దూరంగా ఉంచారు. దీని ఫలితంగా వాటి ధరలు తగ్గాయి. ఒక వారంలో వెండి ధరలు కూడా రూ.4000 కంటే ఎక్కువ తగ్గాయి.