GSLV-3: మరో మైలురాయి లాంటి ప్రయోగానికి ఇస్రో సిద్ధమయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జీఎస్‌ఎల్వీ మార్క్-3ను నింగిలోకి పంపించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 23న జీఎస్‌ఎల్వీ-3 (GSLV-3) అందరిక్షంలోకి దూసుకువెళ్లనుంది. ఇందుకు తిరుపతి జిల్లా శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 36 కమర్షియల్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపించనున్నారు. ఎన్‌ఎస్‌ఐఎల్ తో ఒప్పందం తరువాత నిర్మాణం అయిన తొలి బరువైన రాకెట్ ఇదే కావటం విశేషం. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్‌ను రూపొందించారు.
వాస్తవానికి ఈ రాకెట్‌ను ఎప్పుడో ప్రయోగించాల్సింది.. కానీ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఇప్పుడు (GSLV-3) ప్రయోగానికి సిద్ధమయ్యింది. ఎల్ వీఎం-3గా ఈ ప్రయోగం ఎన్‌ఎస్‌ఐఎల్‌తో పాటు ఇస్రోకు కూడా ఓ మైలురాయి లాంటి ప్రయోగం ఇది. ఉపగ్రహాలు విడిచిపెట్టే ప్రదేశానికి సమీపంలో గ్రౌండ్ స్టేషన్ అందుబాటులో లేకపోవటంతో, అతిపెద్ద షిప్‌లలో ఈ భూకేంద్రాన్ని వినియోగించుకోవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉపగ్రహాలను పసిగట్టే. గ్రౌండ్ స్టేషన్‌ను ఈ నెల 1 నుంచే చెన్నై షిప్‌ల ద్వారా అంటార్కిటికా వైపు మళ్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 14కు ఇవి అక్కడకి చేరుకుంటే, రాకెట్ ప్రయోగ సమయాన్ని వెల్లడిస్తారు.