ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్(Hemant Soren) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తమ సీఎం అభ్యర్థిగా హేమంత్‌ను ఎన్నుకుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హేమంత్ సోరెన్ చేత రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్(Santosh Kumar Gangwar) ప్రమాణ స్వీకారం చేయించారు. రాంచీలోని మొరహాబాదీ మైదానం వేదికగా ఆయన ప్రమాణ స్వీకార వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi), పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సమాజ్‌వాదీ పార్టీ సుప్రీమో అఖిలేష్ యాదవ్, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు ఝార్ఖండ్‌కు హేమంత్ సోరెన్(Hemant Soren) మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తాజాగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు ఎన్నికల్లో నెగ్గి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 స్తానాలకుగానూ జేఎంఎం 34 స్థానాల్లో విజయం సాధించింది.