Samosa Controversy | హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాజకీయాల్లో సమోసా చిచ్చు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు కారణమైంది. ఈ వివాదంపై తాజాగా స్వయంగా సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు స్పందించారు. అంతటి పరిస్థితికి దారితీసిందీ సమోసా వివాదం. అసలేమైందంటే.. అక్టోబర్ 21న ఈ వివాదానికి బీజం పడింది. ఆ రోజు సీఎం సుఖ్విందర్.. సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ఓ ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, కానీ వాటిని సెక్యూరిటీ సిబ్బంది ఆరగించేశారని వార్తలు వెల్లువెత్తాయి.
సీఎంకు చేరాల్సిన సమోసాలు మధ్యలో ఎలా మాయమయ్యాయో తెలుసుకోవడానికి సీఎం ఏకంగా సీఐడీని రంగంలోకి దించాడని కూడా వార్తలు వెల్లువెత్తాయి. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇదంతా కూడా ఒక హాస్యాస్పద అంశమని, సీఎంకు వచ్చిన సమోసాలను ఇతరులు తింటే ఏమవుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘‘సీఎం తినాల్సిన సమోదాలు తీసుకెళ్లింది ఎవరు? దీని నిగ్గును సీఐడీ తేల్చనుంది?’’ అంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చారు.
‘‘అసలు అటువంటిదేమీ జరగలేదు. సీఐడీ విచారిస్తున్న అంశం వేరు. బీజేపీ వాళ్లే కావాలని సమోసా ప్రచారం(Samosa Controversy) చేస్తున్నారు’’ అని సీఎం సుక్కు(Sukhvinder Singh Sukhu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హిమాచల్ ప్రదేశ్ సీఐడీ డీజీ సంజీవ్ రంజన్ కూడా స్పందించారు. ‘‘దర్యాప్తు, విచారణ అనేవి సీఐడి అంతర్గత వ్యవహారం. దానిని రాజకీయం చేయొద్దు. ముఖ్యమంత్రి సమోసాలు తినరు. మేం ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆదేశించాం. ఈ విషయంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ సమాచారం అసలు ఎలా లీక్ అయిందో కూడా తెలుసుకుంటాం’’ అని సంజీవ్ తెలిపారు.