Human Sacrifice: సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్నాం. 5జీ వచ్చిందంటూ ఆనందపడుతున్నాం. చంద్రుడి మీద కాలు మోపామని గర్వంగా చెప్పుకుంటున్నాం. రోబోతో పనులు చేయించుకుంటున్నామని కాలర్ ఎగరేస్తున్నాం. అయినా కొందరు ఇంకా రాతికాలంలోనే ఉండిపోయారా అనిపించకమానదు. నరబలి ఇస్తే ఆర్థికంగా ఎదుగుతాం.. డబ్బు ఈజీగా వస్తుందనే ఆశతో ఇద్దరు మహిళలను చంపేశారు. ఈ దారుణమైన ఘటన కేరళోని పథనం తిట్ట జిల్లాలో జరిగింది. మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారంటే అర్థం చేసుకోవచ్చు.. నిందితులు ఎంతగా మూఢనమ్మకాలతో మునిగిపోయి ఉన్నారోనని…
తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్, అతని భార్య లైలాకు మూఢనమ్మకాలపై విశ్వాసం ఉండేది. ఈ క్రమంలోనే నరబలి(Human Sacrifice) ఇస్తే, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని ఎవరో చెప్పగా నమ్మిన భార్యాభర్తలు, నరబలి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. వీరిద్దరికీ మహ్మద్ షఫీ అనే వ్యక్తి సైతం తోడయ్యాడు. కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలను ట్రాప్ చేసిన మహ్మద్ షఫీ, సోషల్ మీడియాలో స్నేహం పెంచుకున్నాడు. వారిద్దర్నీ నమ్మించి, సెప్టెంబర్ 26న ఇళ్ల నుంచి బయటకు వచ్చేలా చేసి, కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. అనంతరం మృతదేహాలను ముక్కలుగా చేసి పాతిపెట్టారు. మృతులిద్దరూ లాటరీ టికెట్లు విక్రయిస్తూ బతికే పద్మం, రోస్లీగా పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గర్నీ పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు.
నరబలి కేసులో ట్విస్ట్:
క్షుద్రపూజలు చేసిన అనంతరం నరబలి ఇచ్చినట్లు నిందితులు ఒప్పకున్నారు. కాగా, మృతదేహాలను ముక్కల చేసిన తరువాత, వారి శరీర భాగాలను వండుకొని తిన్నారట. పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకోగా.. ఇదంతా మాంత్రికుడిగా చెప్తున్న షఫీ సూచనల మేరకే ఇదంతా చేసినట్లు వివరించారు. ఇలా చేయటం ద్వారా సిరి సంపదలతో పాటు యవ్వనంగా మారుతారని మాంత్రికుడు చెప్పాడట.