కోచింగ్ క్లాసులపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి(Narayana Murthy) సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను ఇవి మెరుగుపరుస్తాయన్న నమ్మకం తనకు లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. తరగతి గదిలో టీచర్లు చెప్పే పాఠాలపై శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్ క్లాస్‌ల అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. డబ్బులు వదిలించుకోవడం వల్ల కోచింగ్ క్లాసుల వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అన్నారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి అవి తప్పుడు మార్గంగా నిలుస్తున్నాయని అన్నారు. బెంగళూరులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కోచింగ్ క్లాసుల వ్యవహారంపై స్పందించారు. పోటీ పరీక్షల కోచింగ్ దేశవ్యాప్తంగా ప్రతిసద్ధి చెందిన కోటాలో చోటుచేసుకుంటున్న వరుస ఆత్మహ్యతలపై ప్రశ్నించగా నారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. అసలు తనకు కోచింగ్ క్లాసులపై నమ్మకమే లేదన్నారు.
‘‘ఈరోజుల్లో కోచింగ్ క్లాసులకు వెళ్లే చాలా మంది తరగతి గదుల్లో పాఠాలు సరిగా వినని వారే. లేదంటే ఇంటిదగ్గర తల్లిదండ్రులు వారికి చదువులో సహాయం చేయలేని స్థాయిలో ఉండి ఉండాలి. అలాంటి వాళ్లే కోచింగ్ క్లాసులపై ఆసక్తి చూపుతారు. దురదృష్టవశాత్తూ మన దేశంలో బట్టీ పట్టే చదువులకు పెద్దపీట పడుతుంటుంది. అది చాలా బాధాకరం. దీని వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, వాస్తవిక సమస్యలను పరిష్కరించుకునే సన్నద్ధత తగ్గపోతోంది’’ అని Narayana Murthy చెప్పుకొచ్చారు.