కేరళలోని వయనాడ్(Wayanad)లో ప్రకృతి చేసిన విలయతాండవానికి వేల మంది నష్టపోయారు. వారికి ఇప్పటికీ సరైన పునరావాస సదుపాయాలు అందకపోవడంపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా వయనాడ్ ప్రమాద బాధితులకు సరైన పునరావాసం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. వయనాడ్ ప్రజల బాగోగులను పట్టించుకోకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
ప్రస్తుతం ప్రియాంక గాంధీ.. రెండు రోజుల పాటు వయనాడ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఆమె మనంతవాడి, కప్పెట్టా ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా వయనాడ్ ప్రమాద బాధితులకు పునరావాసం కల్పించాలని ప్రధాని మోదీ(PM Modi), సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan)లను కోరారు ఎంపీ ప్రియాంక గాంధీ.
‘‘ప్రజా హక్కులను నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్న శక్తులను మేము ఎంతో కాలంగా పోరాడుతున్నాం. ప్రధాని మోోదీ మాత్రం ప్రజల గురించి కాకుండా తన స్నేహితుల గురించి, వారి అభివృద్ధికి మాత్రమే ఆలోచిస్తున్నారు. వయనాడ్ విపత్తులో వేల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయినా కేంద్ర ప్రభుత్వం పట్టనట్లు కూర్చుంది.
ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందించలేదు. విపత్తు బాధితులకు సరైన పునరావాసం కల్పించడాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తా’’ అని ఆమె(Priyanka Gandhi) మనంతవాడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు.