New Covid Cases | దేశంలో కరోనా మహమ్మరి నుంచి ఇప్పుడిప్పుడే జనం కోలుకుంటున్నారు. చాలా మంది అయితే అసలు కరోనా సంగతే మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే 148 కొత్త కేసులు నమోదుకాగా.. గత 24 గంటల్లో 166 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగం కేరళ రాష్ట్రంలో వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం చలికాలం కావడంతో ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది.
New Covid Cases | అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా(Shimla)లోని ఓ ఆసుపత్రిలో మహిళ కరోనా కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. చలికాలం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. కాగా దేశంలో ఇప్పటి వరకూ 4.44 కోట్ల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అందులో 5,33,306 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉండగా.. ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.