భారతదేశంలోని విమానయాన సంస్థలకు(Indian Airlines) వస్తున్న బాంబు బెదిరింపులపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహోల్ కీలక సమాచారాన్ని వెల్లడించారు. 2024 ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు భారత విమానయాన సంస్థలకు 994 బాంబు బెదిరింపులు వచ్చాయని, అవన్నీ కూడా బూటకాలేనని అధికారులు తేల్చారని ఆయన పార్లమెంటు వేదికగా వెల్లడించారు. 2022 నుంచి 2024 నవంబర్ 13 వరకు మొత్తం 1,143 బెదిరింపులు నమోదైనట్లు తెలిపారు. ఇవి క్రమంగా పెరుగుతున్నాయని, ఇవి ప్రయాణికుల్లో భయాందోళనలను అధికం చేస్తున్నాయని చెప్పారు. వీటిపై ఇప్పటికే కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ బూటకపు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని కనుగొనడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు.
Indian Airlines | కానీ ఈ బెదిరింపులకు పాల్పడుతున్న వారి లోకేషన్ పర్ఫెక్ట్‌గా తెలియకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని చెప్పారు. ఇటువంటి బూటకపు బెదిరింపులు వంటి వాటిని నియంత్రించడం కోసం పౌర విమానయన భద్రత మండలి(BCAS), ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ బెదిపులపై దర్యాప్తు చేయడం కోసం బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు విస్తారా, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిర్‌ఇండియా, అలయన్స్ ఎయిర్, స్టార్‌ఎయిర్ సహా మరెన్నో విమానయాన సంస్థలకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటి వరకు లభించిన సమాచారం మేరకు అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. కాగా ఇంకా చాలా కాల్స్‌కు సంబంధించి నిందితులను పట్టుకోవాల్సి ఉన్నట్లు సమాచారం.