భారతదేశ విద్యావ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క విషయంలో మన విద్యావ్యవస్థ అట్టర్ ప్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల హడావుడీ మొదలైంది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ జోరుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఝార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించిన ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మెళన్(Samvidhan Samman Sammelan)’ సభలో ఆయన విద్యావ్యవస్థను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆదివాసీల గురించి బోధించడంలో తన విద్యావ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలోనే కేంద్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘గిరిజనుల చరిత్ర, సంస్కృతి, వారసత్వం, వైద్య విధానాలను బీజేపీ హరిస్తోంది. వాటిని పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నిస్తోంది. దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాల వారిని ప్రధాని మోదీ(PM Modi) మాటల్లోనే గౌరవిస్తున్నారు. ఒక పక్క వారిని గౌరవిస్తున్నామంటూ ప్రసంగాలిస్తూ మరోపక్క వారి హక్కులను హరిస్తున్నారు. అనేక సంస్థల నుంచి వారిని బహిష్కరిస్తున్నారు. ఆర్థిక శాఖలో ఒక్క గిరిజనుడు కానీ, దళితుడు కానీ లేరు. ఆదివాసీల మూలాల గురించి బోధించడంలో మన విద్యావిధానం ఫెయిల్ అయింది. మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తోంది. వారికి నచ్చినట్లు మార్చుకుంటుంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).