గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో భారత నేవీకి(Indian Navy) చెందిన స్కార్పియన్ శ్రేణి సబ్‌మెరైన్‌కు భారీ ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన పడవ.. నేవీ సబ్‌మెరైన్‌ను ఢీ కొట్టింది. భారత రక్షణ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ ప్రమాదానికి కారణమైన చేపలవేటకు వచ్చిన పడవలో 13 మంది మత్స్యకారులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ప్రమాదం వల్ల వారు సముద్రంలో పడిపోయారని, వారిలో 11 మందిని రక్షించగా మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదని అధికారులు వెల్లడించారు. ఆ ఇద్దరి కోసం ఇంకా గాలింపులు చేస్తున్నట్లు నేవీ ప్రతినిధి ప్రకటించారు.
వారిద్దరి ఆచూకీ తెలుసుకోవడం కోసం నేవీ(Indian Navy).. అదనపు సామాగ్రిని రప్పించామని, ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తాన్ని కోస్ట్‌గార్డ్స్ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ గాలింపు చర్యలకు ఆటంకం కలుగకుండా నౌకల దారిని కూడా మళ్లించినట్లు అధికారులు తెలిపారు. గోవా(Goa) దగ్గర ప్రమాదానికి గురైన సబ్‌మెరైనా స్కార్పియన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామిగా అధికారులు భావిస్తున్నారు. నేవీలో వివిధ రకాల మిషన్లను చేపట్టే సామర్థ్యం దీనికి ఉందని, దీనిని యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్,యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కోసం తయారు చేశారని అధికారులు తెలిపారు. ఇందులో అత్యాధునిక శబ్ది నియంత్రణ సాంకేతికత కూడా ఉంది.