వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ఆలయ ప్రతిష్ట జరగనున్న సంగతి తెలిసిందే. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజుల పాటు ప్రతిష్ట కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వాహకులు నిర్వహించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా 2500 మంది ప్రముఖులు, 4వేల మంది సాధువులు పాల్గొననున్నారు. ప్రతిష్ట జరిగిన తర్వాత రోజు నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. దీంతో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో అయోధ్య(Ayodhya)కు మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను నడపనున్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. జనవరి 19 నుంచి ఈ రైళ్ల రాకపోకలు ఉంటాయంటున్నారు. ఇందుకోసం అయోధ్యలోని రైల్వేస్టేషన్‌ను కూడా ఆధునీకరణ చేస్తున్నారు. ఇప్పటికే పనులు పూర్తి కావొస్తున్నాయి. రోజుకు దాదాపు 50వేల మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. జనవరి 15 నాటికి స్టేషన్ పూర్తిగా సిద్ధమవుతుందని అధికారలు తెలిపారు.