ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ సోమనాథ్(ISRO Chairman Somanath) తాజాగా పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఈరోజు జరిగిన మద్రాస్ ఐఐటీ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన సోమనాథ్.. ఓ పల్లెటూరి కుర్రాడి కల సాకారమైందన్నారు. అయితే ఇది సోమనాథ్ అందుకున్న తొలి పీహెచ్‌డీ ఏమీ కాదు. ఇప్పటికే ఆయన అనేక విశ్వవిద్యాలయాల నుంచి డజనుకుపైగా పీహెచ్‌డీలను పూర్తి చేసి ఉన్నారు. కాగా చంద్రయాన్-3 విజయవంతం అయిన తర్వాత పీహెచ్‌డీ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సోమనాథ్ చెప్పారు.
‘‘ఒక పల్లెటూరి కుర్రాడిగా టాపర్ అయినప్పటికీ ఐఐటీ ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి ధైర్యం చేయలేకపోయాను. ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ కావాలని కల కన్నాను. కానీ ఇప్పుడు పీహెచ్‌డీ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అని వివరించారు సోమనాథ్(ISRO Chairman Somanath). నిజానికి ఆయన తన గ్రాడ్యుయేషన్‌ను కొల్లాంలోని తంగల్ కుంజు ముసలియార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో పూర్తి చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఐఐఎస్‌సీ బెంగళూరు నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.