భారతదేశ ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) వీడ్కోలు పలికారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ గ్రాండ్‌గా నిర్వమించింది. ఈ సందర్భంగా డీవై చంద్రచూడ్ సక్సెసర్‌గా సీజేఐ పదవి స్వీకరించనున్న సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) ఎమోషనల్ అయ్యారు. సుప్రీంకోర్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం చంద్రచూడ్ నిర్విరామంగా చేసిన కృషి అజరామరమని కొనియాడారు. చంద్రచూడ్ పదవీ విరమణతో సుప్రీంకోర్టులో తెలియని శూన్యం ఆవరిస్తుందని, న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలు అమోఘమైనవని పేర్కొన్నారు సంజీవ్.
‘‘న్యాయం అనే అరణ్యంలో ఎంతో ఎత్తైన వృక్షం వెనకడుగు వేస్తే.. పక్షులు తమ కిలకిలారావాలను ఆపేస్తాయి. గాలి తన దిశను మార్చుకుంటుంది. మిగిలిన చెట్లు అటుగా కదులుతూ ఆ ఎత్తైన వృక్షం ఏర్పరిచిన శూన్యాన్ని భర్తీ చేస్తాయి. కానీ ఆ అరణ్యం మళ్ళీ తన యథాస్థానానికి రాదు. సోమవారం నుంచి మేమంతా ఈ మార్పును చూడనున్నాం. ఈ న్యాయస్థానం స్తంభాల ద్వారా ఈ శూన్యం ప్రతిధ్వనిస్తుంది. బార్ అసోసియేషన్ సభ్యులు, బెంచ్ సభ్యుల గుండెల్లో నిశ్శబ్దం నెలకొంటుంది’’ అని సంజీవ్(Sanjiv Khanna) వ్యాఖ్యానించారు.