భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) తదుపరి సీజేఐగా బాధ్యతలు స్వీకరించునున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సంజీవ్ ఖన్నాతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయన పదవీకాలం మే 13, 2025 వరకు ఉంటుంది.
అక్టోబరు 16న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సిఫారసు మేరకు అక్టోబర్ 24న జస్టిస్ ఖన్నా నియామకాన్ని ఆమోదిస్తూ కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. శుక్రవారం జస్టిస్ చంద్రచూడ్ CJIగా చివరి పనిదినం కావడంతో ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, జనవరి 2019 నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఖన్నా(Sanjiv Khanna).. ఈవీఎంలను సమర్థించడం, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వంటి అనేక చారిత్రాత్మక తీర్పులలో కీలక పాత్ర పోషించారు.