Kangana Ranaut – Techie Atul | బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ బలవన్మరణ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తొలిసారి భారతదేశ న్యాయవ్యవస్థ అట్టర్ ప్లాప్ అయిందని, న్యాయ వ్యవస్థ సైతం మగాడిదే తప్పన్న రీతిలో ప్రవర్తిస్తే ఎలా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భార్య వేధింపులు, భార్య కుటుంబ బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నా న్యాయం చేయాల్సిన కోర్టు సైతం భార్యకే మద్దతు పలికింది. దాంతో మగవారికి న్యాయం దొరకదన్న నిరాశ నిస్పృహలకు వెళ్లిపోయాడు అతుల్ సుభాష్.
తన బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కుమిలిపోయాడు. తనకు మరణమే శరణ్యం అనుకున్నాడు. తన పరిస్థితిపై సుదీర్ఘ వీడియో తీసి.. అందరికీ షేర్ చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) స్పందించారు. అతుల్‌కు జరిగింది తెలిసి తానెంతో కలవరం చెందానని, నిజంగా ఇది దురదృష్టకరమని అన్నారు.
‘‘అతుల్ వీడియో చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. స్త్రీవాదం పేరుతో ఎంతకైనా తెగించడం హేయమైన చర్యే. అతడి ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా కోట్ల రూపాయలు దోచుకున్నారు. తీవ్ర ఒత్తిడిలో చేసేదేమీ లేక.. అతుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ ఒక్క ఘటన వల్ల మహిళలు అందరినీ తప్పుబట్టలేం.
పెళ్ళికి సంబంధించి 99 కేసుల్లో మగవారిదే తప్పు ఉంటుంది. అందుకే ఈ విషయంలో పొరపాటు జరిగి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. ఆమె(Kangana Ranaut) వ్యాఖ్యలపై స్పందిస్తున్న నెటిజన్లు.. అది మన వరకు సమంజసమే అయినా న్యాయస్థానం సైతం ఒక సైడ్ తీసుకుని కేసును చూడటం సరికాదంటున్నారు.