భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar) లండన్ పర్యటనలో భారీగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన కారులో బయలుదేరుతుండగా ఒక ఖలిస్తానీ ఉగ్రవాది దాడికి ప్రయత్నించాడు. ఒక డిస్కషన్ ముగించుకుని చాహ్తామ్ హౌస్ వేదిక నుండి జైశంకర్ బయలుదేరుతుండగా, ఖలిస్తానీ తీవ్రవాదుల(Khalistani Extremists) బృందం వేదిక వెలుపల గందరగోళం సృష్టించి తమ జెండాలతో నిరసనకు దిగారు. అదే సమయంలో వారి గుంపులోని ఒక వ్యక్తి మంత్రి కారు వైపు పరిగెత్తి పోలీసు అధికారుల సమక్షంలోనే భారత జాతీయ జెండాను కూడా చింపేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. దాడి చేసిన వ్యక్తి జైశంకర్(Jaishankar) కారు వైపు దూకుడుగా కవాతు చేస్తూ, నినాదాలు చేస్తూ, భారత జెండాను అవమానిస్తున్నట్లు కనిపిస్తోంది. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కాగా, బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శితో జరుగుతున్న ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొనడానికి కేంద్రమంత్రి మార్చి 4న లండన్(London) కు బయలుదేరారు. నివేదికల ప్రకారం, ఇద్దరు దౌత్యవేత్తలు వాణిజ్యం, వ్యూహాత్మక సహకారం, భౌగోళిక రాజకీయాలు వంటి అనేక అంశాలపై చర్చించారు. జైశంకర్ మార్చి 9 వరకు లండన్‌లో ఉంటారని భావిస్తున్నారు.