స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకి(Kunal Kamra) ముంబై పోలీసులు రెండవ నోటీసు జారీ చేశారు. దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కునాల్ పై పరువు నష్టం కేసు దాఖలైన విషయం తెలిసిందే. శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు ఆధారంగా ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. దర్యాప్తుకు హాజరయ్యే తేదీని వెల్లడించనప్పటికీ, మంగళవారం జారీ చేసిన ప్రాథమిక నోటీసుకు స్పందించడానికి కునాల్ ఒక వారం సమయం కోరినట్టు అధికారులు ధృవీకరించారు.
ఇటీవల ముంబైలో జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోలో ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) రాజకీయ చర్యలపై కునాల్ సెటైర్స్ వేశారు. 2022లో ఉద్ధవ్ థాకరేపై జరిగిన తిరుగుబాటులో షిండే పాత్రను లక్ష్యంగా చేసుకుని ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, రెండవ నోటీసుకు స్పందించకపోతే కునాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే కునాల్(Kunal Kamra) ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇది మొదటిసారి కాదు. తన బహిరంగ అభిప్రాయాలకు పేరుగాంచిన ఆయన గతంలో రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని చేసిన జోకులకు విమర్శలు, చట్టపరమైన చర్యలను ఎదుర్కొన్నారు.