పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)పై ఫిర్యాదు నమోదైంది. అస్సాం సహా పలు రాష్ట్రాల్లో అశాంతి చెలరేగుతుందంటూ కేంద్ర ప్రభుత్వం, బిజెపి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మమత. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వినీత్ జిందాల్(Vineet Jindal) ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవల మమతా బెనర్జీ తృణమూల్ విద్యార్థి విభాగం, తృణమూల్ ఛాత్రా పరిషత్ వ్యవస్థాపక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలను పెంచేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని మమతా ఆరోపించారు. బెంగాల్ లో అశాంతి చెలరేగితే అస్సాం సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించారు. ఆ రాష్ట్రాలన్నీ అగ్నిగుండంగా మారతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన వినీత్ జిందాల్ ఆమె(Mamata Banerjee)పై కేసు నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మమతా చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య ద్వేషం, శత్రుత్వం పెంచేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలతో దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అటు మమత వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ(Himanta Biswa Sarma) సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బెదిరించొద్దని, మీ కోపం మాపైన ప్రదర్శించొద్దని మండిపడ్డారు.