రాజస్థాన్(Rajasthan) రాజధాని జైపూర్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలో వరుసగా మూడు సార్లు భూకంపం వచ్చింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చారు. మళ్లీ భూమీ కంపిస్తుందేమోని అని జైపూర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జైపూర్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
ఈ భూకంపంపై రాజస్థాన్(Rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. జైపూర్(Jaipur)తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించిందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ వార్తలు రాలేదని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందించారు. ‘జైపూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ప్రజలు క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.