దేశ రాజకీయాలను మార్చే సత్తా మహారాష్ట్ర ఎన్నికలకు ఉందంటూ ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’లో స్థానాల కేటాయింపు జరిగింది. అందులో తమకు 12 స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు అఖిలేష్ వెల్లడించారు. ఇప్పటికే తమ పార్టీ బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఈ ఎన్నికలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలకు భవిష్యత్తును మార్చే సత్తా ఉందని, దాంతో పాటుగా దేశ రాజకీయాలకు మలుపు తిప్పగలవని చెప్పుకొచ్చారు. ధూలే నగరంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బీజేపీ విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తుంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను విభజించి అధికారాన్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీకి విద్యావంతులైన అభ్యర్థులను పంపడం ప్రజల బాధ్యత. దేశ రాజకీయాలను మార్చే సత్తా మహారాష్ట్ర ఎన్నికలకు ఉంది. ఇవి చారిత్రాత్మకమైనవి. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో బీజేపీ కనుమరుగవడం ఖాయం. దీంతో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం కూడా పేక మేడలా కూలిపోతుంది. అన్ని విషయాలకు బుల్డోజర్లను పంపే యూపీ సీఎం యోగి(Yogi Adityanath)కి మళ్ళీ అధికారం రాదు. రానున్న అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, వారి మిత్రపక్షాలను చిత్తు చేసి తగిన గుణపాఠం నేర్పాలని ప్రజలను కోరుతున్నా’’ అని Akhilesh Yadav వ్యాఖ్యానించారు.